. టీడీపీ, పోలీసుల కుమ్మక్కుతో వైసీపీ అభ్యర్థులకు అన్యాయం
. పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం
నరసరావుపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియలో పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దిగజారిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. టీడీపీ కూటమి నాయకులు పోలీసులతో కుమ్మక్కై వైసీపీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మహిళా అభ్యర్థులపైనా దౌర్జన్యమా?
ములకలూరు, పెట్లూరివారిపాలెం, అలవాల గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు మహిళా అభ్యర్థులపై కూడా దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని గోపిరెడ్డి మండిపడ్డారు. మహిళలను సైతం పురుషులు తోసివేయడం, దాడులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు గంటల నిరీక్షణ.. అయినా నామినేషన్లకు అడ్డంకులు:
రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో నామినేషన్ల కేంద్రాన్ని గత 40 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా పరగటిచర్లకు మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 300 మంది మహిళలు, పురుషులు నామినేషన్లు వేసేందుకు వెళ్లినా గ్రామంలోకి, నామినేషన్ కేంద్రం వద్దకు అనుమతించకుండా రోడ్డుపైనే నిలువరించారని ఆరోపించారు. పోలీసు వాహనాలను అడ్డుపెట్టి అభ్యర్థులను వెనక్కి పంపించారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిరీక్షించిన తర్వాత కొద్దిమంది అభ్యర్థులకే నామినేషన్లు వేసే అవకాశం కల్పించారని విమర్శించారు.
పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి:
నరసరావుపేట రూరల్ మండలంలోని చిన్నతురకపాలెం, పెదరెడ్డిపాలెం, వీరవట్నం, అన్నవరపాడు తదితర గ్రామాల్లోనూ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోపిరెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఫిర్యాదు చేసినా స్పందన కరువు:
నామినేషన్ల అడ్డగింతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని కోరారు.
చంద్రబాబు కొత్త ఎన్నికల కోడ్ రాస్తున్నారు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలకు పాల్పడే విధానాలకు తెరతీస్తున్నారని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళికి బదులుగా చంద్రబాబు తనదైన ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
28 పంచాయతీల్లో 14 చోట్లే నామినేషన్లు:
రొంపిచర్ల మండలంలో మొత్తం 28 పంచాయతీలు ఉండగా, ఇప్పటివరకు 14 పంచాయతీల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని తెలిపారు. మరో 14 పంచాయతీల్లో అభ్యర్థులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నరసరావుపేట రూరల్ మండలంలోని 26 గ్రామాలకు గాను కేవలం 12 గ్రామాల్లోనే నామినేషన్లు దాఖలయ్యాయని, మరో 14 గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉందని గోపిరెడ్డి వివరించారు.
నిష్పక్షపాత ఎన్నికలే మా డిమాండ్:
మున్సిపల్ ఎన్నికల్లోనైనా, పంచాయతీ ఎన్నికల్లోనైనా ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పించాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రజల్లో ఆదరణ లేదని భావిస్తే ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాతీర్పును స్వీకరించాలని గోపిరెడ్డి సవాల్ విసిరారు.
నామినేషన్లకు చివరి రోజు మాత్రమే మిగిలి ఉన్నందున జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీతో పాటు పోలీసు అధికారులందరూ తక్షణమే స్పందించి అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడి, ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ల అడ్డగింతతో ప్రజాస్వామ్యం ఖూనీ
BY Jani Mastan Shaik
- November 16, 2026
- 198 Views


