నరసరావుపేట: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధిగా ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ హెడ్మాస్టర్ షేక్ ఖాజావలిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెలి రామకృష్ణ రెడ్డిల నిర్ణయం మేరకు ఈ ప్రకటన వెలువడింది. స్థానిక గుంటూరు రోడ్డులోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
మైనారిటీ వర్గానికి దక్కిన సముచిత గౌరవం:
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 17-18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మైనార్టీ వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. 1981-86 మధ్య కాలంలో నరసరావుపేట మున్సిపాలిటీ చైర్మన్లుగా డాక్టర్ షేక్ ఫరీద్, సుభాని పనిచేసిన తర్వాత, కచ్చితంగా 40 ఏళ్ల తరువాత ఒక మైనారిటీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి వైయస్సార్సీపీ ఈ అవకాశం కల్పించిందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మైనారిటీలకు ఈ ప్రాధాన్యం దక్కిందని పేర్కొన్నారు.
48 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు పూర్తి:
నరసరావుపేట పట్టణంలోని మొత్తం 48 వార్డులకు వైయస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ముగిసిందని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా కాకుండా, ప్రజా తీర్పును శిరసావహించేలా కూటమి ప్రభుత్వం మరియు అధికార వర్గం వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. గెలుపోటములు సహజమని, ఎవరైనా సరే ప్రజా తీర్పును స్వాగతించాలని సూచించారు.
నామినేషన్ల సమయంలో టీడీపీ అభ్యర్థుల దౌర్జన్యాలు:
నియోజకవర్గంలోని పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనేకచోట్ల దౌర్జన్యాలకు పాల్పడిందని గోపిరెడ్డి ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలలో వందల మంది గుండాలను పెట్టి వైయస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని మండిపడ్డారు. అలవాల, ములకలూరు, కొనకంచివారిపాలెం, మాచవరం గ్రామాల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఈ విషయంపై స్టేట్ ఎన్నికల కమిషనర్, కలెక్టర్ ,ఎస్పీలకు ఫిర్యాదు చేశామని, అన్ని గ్రామాల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిచాలని డిమాండ్ చేశారు.
విప్పర్ల గ్రామంలో బాంబుల కలకలం-పోలీసుల తీరుపై విమర్శలు:
రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో సర్పంచ్ నామినేషన్ సందర్భంగా టీడీపీకి చెందిన రెండు గ్రూపులు నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, కర్రలతో స్వైర్యవిహారం చేసి భయోత్పాత వాతావరణం సృష్టించాయని గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ నాయకుల ఇళ్లపై కార్డెన్ సెర్చ్ నిర్వహించే పోలీసులు, టీడీపీ వర్గీయుల ఇళ్లలో బాంబులు దొరికినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. నామినేషన్ సందర్భంగా పోలీసు హోంగార్డుపైనే టీడీపీ నాయకుడు కత్తితో దాడి చేశారని, వెంటనే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు సేవ చేయడమే నా జీవితాశయం: షేక్ ఖాజావలి
వైయస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపికైన షేక్ ఖాజావలి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి, పిన్నెలి రామకృష్ణ రెడ్డికి మరియు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను 2002లో రిటైర్డ్ హెడ్మాస్టర్గా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రతి రంజాన్ మాసంలో నిరుపేదలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నరసరావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం:
నరసరావుపేట పురపాలక సంఘ ప్రజలు తనను మున్సిపల్ చైర్మన్‌గా గెలిపిస్తే అత్యంత నిజాయితీగా, కష్టపడి పనిచేస్తానని షేక్ ఖాజావలి స్పష్టం చేశారు. పట్టణంలో మంచి నీటి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి అన్ని రంగాల్లోనూ నరసరావుపేటను అభివృద్ధి పథంలో నడిపించి, పట్టణ రూపురేఖలను మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమకు ఒక్కసారి అవకాశం ఇచ్చి, భారీ గెలుపును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధిగా షేక్ ఖాజావలి ఖరారు: గోపిరెడ్డి


