తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పురాతన ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుబడుతూ ఆయన సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై దాడి చేయడమేనని, ఈ పరిణామం తనను ఎంతో కలచివేసిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు హయాంలో ఆలయాల కూల్చివేతల పరంపర నిరాటంకంగా కొనసాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. గతంలో తిరుమలలోని చారిత్రాత్మక వేయి కాళ్ల మండపం కూల్చివేత, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాల తొలగింపు, అలాగే బద్వేల్లోని కాశీనాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన కూల్చివేతలను ఆయన గుర్తు చేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండానే పవిత్ర కట్టడాలను నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ‘శ్రీవాణి ట్రస్ట్’ను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తోందని విమర్శించారు. ‘హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అంటూ జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
హే రామ్! ఆలయాలను రక్షించండి..


