ఒంగోలు: రాజకీయాలు అంటే తలపండిన సీనియర్లకే పరిమితమనే పాత సంప్రదాయాలకు తెరదించుతూ నేటి తరం యువత ప్రత్యక్ష ఎన్నికల్లోకి దూసుకొస్తోంది. కేవలం ఓట్లు సాధించడమే కాకుండా, నగరాల అభివృద్ధిని నిర్దేశించే కీలక పాలనా పగ్గాలు చేపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒంగోలు నగరపాలక సంస్థలో చోటుచేసుకున్న తాజా పరిణామమే ఇందుకు నిదర్శనం. 27వ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా గెలిచిన కొద్ది రోజుల్లోనే, కేవలం 24 ఏళ్ల పిన్న వయసులో డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చావలి చర్పిత రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. నగర మేయర్‌గా శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చర్పిత బాధ్యతలు చేపట్టడంతో ఒంగోలు పాలనా పగ్గాలు పూర్తిగా మహిళల చేతుల్లోకి వెళ్లాయి.
27వ డివిజన్ బరిలోకి దిగిన చర్పిత, సంప్రదాయ ప్రచార పద్ధతులకు భిన్నంగా రీల్స్, సోషల్ మీడియా వీడియోలను ఉపయోగిస్తూ యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆత్మీయంగా పలకరించిన ఆమె ప్రచార శైలి ప్రజల మనసు గెలుచుకుని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఘన విజయాన్ని అందించింది. ప్రఖ్యాత ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన చర్పిత, కార్పొరేట్ రంగంలో ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సమాజ సేవ వైపే మొగ్గు చూపారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె (తాత చావలి కృష్ణయ్య మాజీ కౌన్సిలర్, అమ్మమ్మ అనంతమ్మ అన్నవరం బోర్డు డైరెక్టర్), ఇప్పుడు యువ నాయకత్వ ప్రతిభను పరిపాలనలో నిరూపించాల్సిన కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత


