దేశంలో ముస్లింలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలూ పూర్తిగా విఫలమయ్యాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను సమాన రాజకీయ భాగస్వాములుగా చూడకుండా, కేవలం ఓటు బ్యాంకుగానే మార్చేశాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని కోరుకోవడం లేదన్నారు. లౌకికవాదులుగా చెప్పుకునే పార్టీలకు సైతం మైనారిటీల పక్షాన నిలబడి వారికి సాధికారత కల్పించాలనే నిజాయితీ కరువైందని విమర్శించారు. రాజ్యాంగ రూపకర్తలు దేశ పౌరులందరికీ కుల, మతాలకు అతీతంగా సమాన హక్కులు కల్పించినప్పటికీ, దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు మాత్రం ముస్లింల అధికారాలను హరిస్తూ, వారి ఎదుగుదలను అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముస్లింల రాజకీయ అణచివేత విషయంలో ఏ ఒక్క ప్రభుత్వాన్ని లేదా పార్టీని నిందించలేమని, దేశాన్ని పాలించిన వరుస ప్రభుత్వాలన్నీ ఈ విషయంలో విఫలమయ్యాయని ఒవైసీ విమర్శించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు అందరూ ముస్లింలను కేవలం ఓటర్లుగానే చూశారని, సమాన భాగస్వాములుగా గుర్తించలేదన్నారు. దేశంలో 18 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు పార్లమెంటులో కేవలం 4 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉండటం మన ప్రజాస్వామ్య దుస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి
