అనంతపురం:
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ, కొందరు ఆర్టీసీ సిబ్బంది లబ్ధిదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తుండటం వివాదాస్పదమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా బత్తులపల్లి వద్ద ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు నోటికొచ్చినట్లు దూషించిన ఘటన వెలుగుచూసింది. బస్సు డోర్ క్లోజ్ చేయమని కోరినందుకు డ్రైవర్ తనను తీవ్ర పదజాలంతో అవమానించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ అసభ్య ప్రవర్తనకు నిరసనగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది.బాధితురాలిని బస్సు డ్రైవర్ నోటికొచ్చినట్లు దూషించడంతో ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటనతో బస్సు వద్ద కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళల పట్ల అమానుషంగా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన సదరు ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
