ఢిల్లీ:
దేశంలో వర్షాధారంగా పంటలు సాగుచేసే ప్రాంతాల్లో రాబోయే రబీ సీజన్‌కు ఎల్‌నినో ప్రభావం పెద్ద సవాలుగా మారే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదముందని భావిస్తోంది. ఈసారి వాతావరణ మార్పుల సవాళ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి అతీశ్ చంద్ర వెల్లడించారు. రబీ సీజన్ సన్నద్ధతపై ఢిల్లీలోమంగళవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గడిచిన ఖరీఫ్ సీజన్ కూడా సవాళ్లతో కూడుకున్నదని, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో రైతులు తొలుత విత్తనాలు వేయడంలోనూ, ఆ తర్వాత పైర్లను కాపాడుకోవడంలోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దీని ప్రభావంతో ఖరీఫ్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో నేలలో అధిక తేమ పరిస్థితులు ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంపాటు వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఒత్తిడికి లోనవుతున్నాయని అతీశ్ చంద్ర పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా రబీ పంటల ప్రణాళికలను మార్చుకోవాలని ఆయన సూచించారు. దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ.. పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఉద్యాన ఉత్పత్తులను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నామని, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ దిగుమతులు మరింత పెరిగే అవకాశముందన్నారు. సాధారణంగా దేశంలో 6.38 కోట్ల హెక్టార్లలో రబీ పంటలు సాగవుతుండగా, అందులో గోధుమలే 3 కోట్ల హెక్టార్లను ఆక్రమిస్తున్నాయి. మిగిలిన వాటిలో పప్పుధాన్యాలు 1.4 కోట్ల హెక్టార్లలో, నూనె గింజలు 87 లక్షల హెక్టార్లలో సాగవుతాయి. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసేందుకు పంటల సాగులో వైవిధ్యం (క్రాప్ డైవర్సిఫికేషన్) తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ఆరంభంలో ఎల్‌నినో ప్రభావం అత్యంత తీవ్రరూపం దాల్చి భారత్‌కు గట్టి ముప్పుగా పరిణమించే అవకాశముందని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ‘ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ’ (ఇరి) హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కొలిచే ‘3.4 నినో ఇండెక్స్’ సెప్టెంబరు నాటికి +3.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు తమ ఈఎన్ఎస్వో నివేదికలో వెల్లడించింది. విశ్లేషించిన 22 అధ్యయన నమూనాలూ 2026-27 మధ్య అత్యంత బలమైన ఎల్‌నినో వస్తుందని అంచనా వేశాయి. 2027 ఫిబ్రవరి నాటికి దీని సంభావ్యత 100 శాతంగా ఉండి, చారిత్రాత్మకంగా అత్యంత తీవ్రమైన తీవ్రత కలిగిన వాతావరణ ఘటనల్లో ఒకటిగా రికార్డు సృష్టించే అవకాశముంది.
సాధారణంగా పసిఫిక్ సముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్‌నినో.. భారత రుతుపవనాలను బలహీనపరిచి వర్షాభావానికి, ఫలితంగా దిగుబడుల క్షీణతకు కారణమవుతుంది. అయితే, ఈ సమయంలో హిందూ మహాసముద్ర డైపోల్ (ఐవోడీ) సెప్టెంబరు నుండి డిసెంబరు మధ్య కాలంలో బలమైన సానుకూల (పాజిటివ్) స్థితికి చేరే అవకాశం ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. సానుకూల ఐవోడీ కొన్నిసార్లు ఎల్‌నినో ఇచ్చే ప్రతికూల ప్రభావాన్ని తటస్థం చేయగలదు. నినో 3.4 ఇండెక్స్ ఒక్కటే కాకుండా ఐవోడీ, రుతుపవనాల కదలిక, శీతాకాల వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ‘ఇరి’ హెచ్చరికలు భారత్‌లో రాబోయే వాతావరణ ముప్పునకు బలమైన సూచికగా నిలుస్తున్నాయి.
రబీకి ఎల్‌నినో ముప్పు


