ANDHRA PRADESH LOCAL

ప్రజాక్షేత్రంలోకి తొలి అడుగు

నరసరావుపేట:నరసరావుపేట పట్టణంలోని 12వ వార్డు వెంగళరెడ్డినగర్ లోని తెలుగుదేశం పార్టీ (కూటమి) అభ్యర్థినిగా బరిలోకి దిగిన షేక్ అయేషా రఫీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయ ప్రజాక్షేత్రంలోకి తొలి అడుగు వేసిన ఆమె, తొలి ప్రయత్నంలోనే తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటూ వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాల సందేశం:
ప్రచారంలో భాగంగా అయేషా రఫీ వార్డులోని ప్రతి వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. గత పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజానుకూల నిర్ణయాలను గడపగడపకూ చేరవేస్తున్నారు. పేద,మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా,పింఛన్ల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.

సమస్యల పరిష్కారానికి భరోసా:
కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అయేషా రఫీ ఓపికగా అడిగి తెలుసుకుంటున్నారు. తాగునీటి సరఫరా,అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

స్థానికుల నుంచి విశేష స్పందన:
తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ప్రజలతో మమేకమవుతున్న తీరుకు 12వ వార్డు వాసుల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు చోట్ల మహిళలు, వృద్ధులు ఆమెకు హారతులు పట్టి, పూలమాలలతో స్వాగతం పలుకుతూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. స్థానిక నాయకులు, తెలుగుదేశం, జనసేన,బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ అభ్యర్థిని గెలుపు కోసం సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రచారం సాగుతున్న వార్డులో కూటమి అభ్యర్థినికి ఆదరణ మరింత పెరుగుతోందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Jani Mastan Shaik

About Author