ANDHRA PRADESH

ఇవి ఎన్నికలా.. లేక సెలెక్షన్లా?

తాడేపల్లి:స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని, చివరకు రాత్రికి రాత్రే పోలింగ్‌ శాతాన్ని కూడా పెంచేసి మరీ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గెలిచి ఓడితే.. తాము ఓడి, గెలిచామని, ఎన్నికలు సజావుగా సాగితే చంద్రబాబు ఎందుకు గెలుస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా, అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా ఖూనీ చేశారని మండిపడ్డారు. పారదర్శకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు.
రాత్రికి రాత్రే పోలింగ్‌ శాతం పెంపు.. భారీ రిగ్గింగ్‌ :
చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని జగన్ ఎద్దేవా చేశారు. విశాఖలో రాత్రికి రాత్రే 1,15,887 ఓట్లు ఎలా పెరిగాయని, సోమవారం ఉదయానికి 1,35,154 ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు. రాత్రికి రాత్రి 51.46 శాతం ఉన్న పోలింగ్‌ను ఉదయానికి 56.03 శాతానికి పెంచారని, బ్యాలెట్‌ బాక్సుల స్ట్రాంగ్‌ రూమ్‌లకు కూడా సీళ్లు వేయలేదని ఆరోపించారు. చీమకుర్తి, జమ్మలమడుగు, అద్దంకి, ధర్మవరం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో అసాధారణ రీతిలో గంటల వ్యవధిలో పోలింగ్ శాతాలు విపరీతంగా పెరిగిపోయాయని ఉదాహరణలతో సహా వివరించారు. నామినేషన్లు, స్క్రూటినీ, పోలింగ్ బూత్‌లు, పోలింగ్ సైక్లింగ్, చివరికి పోలింగ్ శాతాలు మరియు బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్‌ చేశారని, ఇవన్నీ దాటుకుని తమ వాళ్లు గెలిస్తే ఆ ఫలితాలను కూడా రిగ్గింగ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్‌ జీ తరంలోనూ రిగ్గింగ్‌, సైక్లింగ్‌ ఎలా చేయాలో ట్యూషన్లు పెట్టి మరీ చంద్రబాబు నేర్పించారని విమర్శించారు.
నామినేషన్ల అడ్డుగింపు.. పోలీసుల ఏకపక్ష వైఖరి:
ఎన్నికల షెడ్యూల్ రాగానే బైండోవర్‌ కేసుల పేరుతో వైయస్సార్‌సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారని, తమ నేతల్ని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారని జగన్ తెలిపారు. స్క్రూటినీ సమయంలో అధికారులే పత్రాలను చింపేశారని, పోలీసులు, అధికారులు మాఫియా ముఠాగా ఏర్పడ్డారని మండిపడ్డారు. అడ్డుకోవాల్సిన ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారిందని విమర్శించారు. 17 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, 84 జడ్పీటీసీల్లో, 2,109 ఎంపీటీసీ స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని ఆరోపించారు. పలు బూత్‌లలో ఏజెంట్లను కూర్చోనివ్వకుండా, పోలీసుల సమక్షంలోనే దొంగివోట్లు, రిగ్గింగ్‌ జరిగాయని మండిపడ్డారు. కుడేరు, మురట్ల, వెలిగండ్ల, సుంకేశుల, చంద్రగిరి, పీలేరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో కూటమి శ్రేణుల దాడులు, పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఏపీ ఫర్‌ సేల్‌గా మార్చేశారు.. శ్రేణుల పోరాటానికి సెల్యూట్:
చంద్రబాబు హయాంలోనే ఏపీ ఫర్‌ సేల్‌గా మారిపోయిందని, ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెట్టారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్‌, గంజాయి రాజ్యమేలుతున్నాయని జగన్‌ ఆరోపించారు. రాజధాని సహా అన్నింటిలోనూ స్కామ్‌లు చేశారని, రాష్ట్రాన్ని సౌత్‌ బిహార్‌తో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మురసు తుపాన్‌ ముంచెత్తుతున్నా ఎన్నికలను వాయిదా వేయలేదని, తుపాను సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ఎన్నికలే ముఖ్యమాయా అని నిలదీశారు. బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల తరఫున బలంగా గొంతు విప్పామని, చంద్రబాబు అక్రమాలను దేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నేతలు హీరోల్లా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వారికి సెల్యూట్ చేశారు.

Jani Mastan Shaik

About Author