Thursday, 29 October 2026
ANDHRA PRADESH NEWS

పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు

పులివెందుల :
పులివెందుల బస్టాండ్‌కు అరుదైన ఘనత దక్కింది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బస్టాండ్‌గా ఇది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించిన పర్యాటక అవార్డుల కార్యక్రమంలో పులివెందుల బస్‌ టెర్మినల్‌కు ఈ అవార్డును అందజేశారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ టెర్మినల్‌కు జాతీయ,రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయాలతో ఆదర్శవంతమైన బస్టాండ్‌గా దీనిని తీర్చిదిద్దారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో సుమారు రూ.38 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా 2022 డిసెంబర్ 24న ఈ బస్టాండ్ ప్రజలకు అంకితం చేశారు . ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా పేరుగాంచిన ఈ టెర్మినల్.. పర్యాటకుల రాకపోకలకు అత్యంత అనువుగా ఉండటమే ఈ గుర్తింపునకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ బస్టాండ్‌లో పలు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఒకేసారి 225 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా మొత్తం 95 బెంచీలతో విశాలమైన సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల అవసరాల నిమిత్తం 13 అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ముఖ్యంగా వికలాంగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక వసతులను కూడా రూపకల్పన చేశారు.ప్రయాణికుల భద్రతకు ఈ టెర్మినల్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. బస్టాండ్ ప్రాంగణం అంతటా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుగా ఏకంగా 55 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిత్యం 24 గంటల పాటు పటిష్టమైన నిఘా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు మరియు పటిష్టమైన భద్రతను కల్పిస్తున్న ఈ టెర్మినల్‌కు పర్యాటక అవార్డు దక్కడం పులివెందుల ప్రత్యేకతను మరోసారి జాతీయ స్థాయిలో చాటిచెప్పిందని ప్రయాణికులు కొనియాడుతున్నారు.

Jani Mastan Shaik

About Author