దేశంలో పెరుగుతున్న నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరల భారాన్ని ఎదుర్కొంటున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ఆయన ‘ఎక్స్’ వేదికగా సోమవారం పోస్ట్ చేశారు. పండుగ సీజన్లోనూ ప్రజలను దోచుకునే పరంపర నిరాటంకంగా కొనసాగుతోందని, వంటింటి బడ్జెట్ అస్తవ్యస్తమై కుటుంబాల పొదుపులు తగ్గి అప్పుల భారం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. ‘మన్ కీ బాత్’లో అనేక అంశాలపై మాట్లాడే ప్రధాని, మధ్యతరగతి, పేద వర్గాలను వేధిస్తున్న ద్రవ్యోల్బణ సమస్యపై నోరు విప్పకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం..
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జులైలో నమోదు అయిన 4.45 శాతంతో పోలిస్తే ఇది మరింత పెరిగింది. అలాగే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం కూడా జులైలోని 5.52 శాతం నుంచి ఆగస్టు నాటికి 5.95 శాతానికి పెరిగింది. ప్రధానంగా కూరగాయల ధరలు అమాంతం పెరగడం సామాన్యుల బడ్జెట్ను దెబ్బతీసింది.
అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు..
గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో ఉల్లి ద్రవ్యోల్బణం 48.27 శాతంగా నమోదైంది. జులైలో ఇది 22.54 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే అల్లం ద్రవ్యోల్బణం 73.82 శాతానికి, వెల్లుల్లి 43.60 శాతానికి చేరి పెను భారాన్ని మోపాయి. విద్యా సేవల విభాగంలో 3.73 శాతం, రవాణా రంగంలో 4.60 శాతం, ఆహారం-పానీయాల విభాగంలో 5.66 శాతం, రెస్టారెంట్లు-వసతి సేవల విభాగంలో 8.38 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది.
అయితే కొన్ని నిత్యావసరాల ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది. గతేడాదితో పోలిస్తే టమాటా ధరలు 31.09 శాతం, బంగాళాదుంపల ధరలు 13.14 శాతం చొప్పున తగ్గినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Previous Article
ఆత్మనిర్భర్ భారత్కు అల్యూమినియం రంగం కీలకం
Next Article

