ANDHRA PRADESH LOCAL NEWS POLITICS STATE

పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్న పోలీసులు

మాచర్ల : తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాచర్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పది రోజులుగా పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పక్షం దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు యూనిఫామ్ కింద పచ్చ చొక్కాలు వేసుకుని టీడీపీ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, అరాచకాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరి డేటా తమ వద్ద ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పిన్నెల్లి ఆరోపించారు. జగనన్న ఆదేశాల మేరకు మాచర్ల మున్సిపాలిటీలో ముస్లిం మహిళకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే, బీ-ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే గంజాయి బ్యాచ్ దాడి చేసి పేపర్లు చించివేసిందని, అభ్యర్థిని రక్తమొచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే రివర్స్‌లో 33 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, నాగార్జున సాగర్ ఎస్‌ఐలు టీడీపీ ఏజెంట్లుగా మారి, పోటీ చేయవద్దని, లేకుంటే గంజాయి కేసులు పెడతామని అభ్యర్థులను, మహిళలను బైండోవర్ల పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని, ఈ విషయమై ఆధారాలతో సహా ఎస్‌ఈసీ , ఎస్పీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో మాచర్లలో 5,400 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించామని, రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు గత 40 ఏళ్లుగా సరైన సౌకర్యాలు లేని ఆసుపత్రిని 50 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా విస్తరించామని పిన్నెల్లి గుర్తుచేశారు. కూటమి అనుకూల మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అందరికీ పెన్షన్లు ఇస్తున్నామంటూ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. తనపై ఇప్పటివరకు 19 అక్రమ కేసులు పెట్టారని, బెయిల్ రద్దు చేస్తామని బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగకుండా బరిలో నిలిచిన తమ అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక మాచర్లలో అరాచకాలు సృష్టించిన వారిపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Jani Mastan Shaik

About Author