భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ
స్వాతంత్ర్య సమరయోధులు దివంగత జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, ఆయన చూపిన బాట నేటి యువతరానికి అత్యంత ఆదర్శనీయమని పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక గుంటూరు రోడ్డులోని వైయస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత నిర్మాణంలోనూ, విద్యా వ్యవస్థను పునర్నిర్మించడంలోనూ
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, నవభారత పునాదులకు అవసరమైన అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. దేశంలో సాంకేతిక, ఉన్నత విద్యకు వెన్నెముకగా నిలిచిన ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT) సంస్థల స్థాపన, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటులో ఆజాద్ గారు కీలక భూమిక పోషించారని తెలిపారు.
జాతిపిత మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ఆజాద్ గారు, తన రచనలు, పత్రికల ద్వారా నాటి సమాజంలో గొప్ప చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతను, మహిళలను పెద్ద ఎత్తున స్వతంత్ర పోరాటం వైపు మళ్లించడంలో ఆయన ప్రచురించిన పత్రికలు అద్భుతమైన పాత్ర పోషించాయని వెల్లడించారు. భారతదేశ సమగ్రతకు, లౌకికత్వానికి, విద్యాభివృద్ధికి ఆజాద్ గారు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్. కరిముల్లాతో పాటు ముఖ్య నాయకులు షేక్ రెహమాన్, షేక్ సిలార్ భాష, షేక్ షబ్బీర్, మహమ్మద్ మంజూరు, సయ్యద్ ఖాదర్ బాషా, సయ్యద్ జాఫర్, గంటెనపాటి గాబ్రియల్, మహమ్మద్ హుస్సేన్, పొదిలే ఖాజా, షేక్ సుభాని, కారుమంచి మీరావలి తదితర వైయస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం యువతకు మార్గదర్శకం : గోపిరెడ్డి


