ANDHRA PRADESH NEWS POLITICS

వైద్య,వ్యవసాయ రంగాల్లో ఏఐ సాంకేతికత

అమరావతి: వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకు అన్ని కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని పాలనలో మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ స్టాక్ సాయంతో పౌర సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు ఆయా శాఖల పనితీరును, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపరచాలని దిశానిర్దేశం చేశారు. పాలనా విభాగాల్లో రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా అంశాలను విశ్లేషిస్తున్నామని, రాబోయే రోజుల్లో డేటా ఆధారిత నిర్ణయాలు (డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయని సీఎం వివరించారు. ప్రభుత్వ సమర్థ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా అందే ప్రజల అర్జీలు, ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం లేకుండా పరిష్కరించాలని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని, ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ, మైనారిటీ సంక్షేమ, ఆర్థిక, పురపాలక, ఇంధన శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Jani Mastan Shaik

About Author