ANDHRA PRADESH LOCAL NEWS

ప్రగతి పథానికి తొలి అడుగు.. విజయాలకు శుభతరుణం

నరసరావుపేట: నరసరావుపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ అభ్యర్థిని షేక్ అయేషా రఫీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వార్డులోని ప్రతి వీధిలోనూ విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలు , భవిష్యత్ ప్రణాళికలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, వృద్ధులు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రచార మార్గాల్లో మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలుకుతుండగా, వృద్ధులు ఆశీర్వదిస్తూ విజయాన్ని కాంక్షిస్తున్నారు.
సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్:
ఈ సందర్భంగా అయేషా రఫీ మాట్లాడుతూ.. 12వ వార్డు ప్రగతి పథానికి ఈ ఎన్నికలే తొలి అడుగని, వార్డు ప్రజల విజయాలకు ఇది శుభతరుణమని పేర్కొన్నారు. వార్డులో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పరిశుభ్రమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో ముందుంటామని తెలిపారు.
రూపేష్ గుప్తా గెలుపుతోనే పట్టణాభివృద్ధి సాధ్యం:
నరసరావుపేట పట్టణ సమగ్రాభివృద్ధి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తా గెలుపుతోనే సాధ్యమవుతుందని అయేషా రఫీ స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధాన సమస్యలు పరిష్కారమై, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రూపేష్ గుప్తాను, 12వ వార్డు కౌన్సిలర్‌గా తనను సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Jani Mastan Shaik

About Author