ANDHRA PRADESH LOCAL NEWS

సేవ్ నరసరావుపేట-సేవ్ జనసేన

. మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపుపై అసంతృప్తి
. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జిలానీపై ఆరోపణలు
. అధిష్టానం జోక్యం చేసుకోవాలని డిమాండ్

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సీట్ల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. పట్టణంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం గురువారం ఏర్పాటు చేసి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సయ్యద్ జిలానీ వ్యవహారశైలిపై బాహాటంగానే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని అసమ్మతి నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా ‘సేవ్ నరసరావుపేట-సేవ్ జనసేన’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మీడియా సమావేశంలో సీనియర్ నేతలు అద్దేపల్లి ఆనంద్, షేక్ అబ్దుల్ రవూఫ్ (అదృఫ్),కోట రామకృష్ణ యాదవ్ (ఆర్ కె) తదితరులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 48 వార్డులకు గాను కూటమి తరఫున స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జనసేనకు 10 సీట్లు కేటాయించడానికి సిద్ధపడినప్పటికీ, ఇన్‌ఛార్జ్ సయ్యద్ జిలానీ కేవలం 7 సీట్లు చాలని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఏడు సీట్లలో కూడా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు కాకుండా, తన వద్ద పనిచేసే వారికి, అనుచరులకే టికెట్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ క్యాడర్‌కు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ఇన్‌ఛార్జ్ వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని కార్యకర్తలు వాపోయారు. తక్షణమే పార్టీ అధిష్టానం, అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సయ్యద్ జిలానీని తొలగించి, సమర్థులైన వారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ఇన్‌ఛార్జ్ తీరుపై తమకు అసంతృప్తి ఉన్నప్పటికీ, కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన తరఫున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులందరి గెలుపు కోసం పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.

Jani Mastan Shaik

About Author