. ఫిబ్రవరి 2న తుది ఓటర్ల జాబితా విడుదల
. ఇప్పటివరకు అందిన 3,343 దరఖాస్తుల పరిశీలన వేగవంతం
. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవు
నరసరావుపేట :
ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్ 23వ తేదీన అధికారికంగా ప్రచురించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా వెల్లడించారు. ఎన్నికల కమిషన్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న ఆమె.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 3,343 దరఖాస్తులు అందాయని, వాటి పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్, తుది జాబితా వివరాలు ఇలా:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఫారమ్-19 ద్వారా దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 6వ తేదీతో ముగిసిందని కలెక్టర్ గుర్తుచేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 18 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ పూర్తి చేసి.. డిసెంబర్ 23న ప్రచురించనున్నారు. అనంతరం డిసెంబర్ 23 నుంచి 2027 జనవరి 12వ తేదీ వరకు కొత్త దరఖాస్తులు, క్లెయిములు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 27 నాటికి అభ్యంతరాలను పరిష్కరించి, అనుబంధ జాబితాల ముద్రణ పూర్తి చేసిన తర్వాత.. 2027 ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం.. తప్పుడు పత్రాలపై హెచ్చరిక:
ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్ల విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 23న ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాతి నుంచి 2027 జనవరి 12లోగా తగిన ఆధారాలతో నవీకరించిన ఫారమ్-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే, ఓటరు నమోదు కోసం ఎవరైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 31, 32 ప్రకారం అది శిక్షార్హమైన నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంగా హెచ్చరించారు.
డిసెంబర్ 23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రచురణ


