నరసరావుపేట: రాబోయే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని పల్నాడు జిల్లా వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన కౌన్సిలర్ స్థానాల్లో దాదాపు 50 శాతం సీట్లకు కోత విధించడం అత్యంత దారుణమని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. మున్సిపల్ రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, ఓటర్ల జాబితాలోని తీవ్ర లోపాలపై బుధవారం స్థానిక మున్సిపల్ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)లను కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఎస్సీ, ఎస్టీల హక్కులకు తూట్లు :
భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం చొప్పున రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలవ్వాల్సి ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనలను కాలరాసిందని విమర్శించారు. గతంలో నరసరావుపేట మున్సిపాలిటీలో 38 వార్డులు ఉన్నప్పుడు ఎస్సీలకు 4 స్థానాలు, ఎస్టీలకు 1 స్థానం కేటాయించగా, ఇటీవల వార్డుల సంఖ్యను 10 పెంచి మొత్తం 48 వార్డులుగా పునర్విభజించిన నేపథ్యంలో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కలిపి కనీసం 12 స్థానాలు దక్కాల్సి ఉందని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 స్థానాన్ని మాత్రమే కేటాయించి సరిపెట్టిందని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన స్థానాల్లో సగానికి పైగా కోత విధించి ఆ వర్గాల హక్కులను హరించివేసిందని మండిపడ్డారు.
ఓటర్ల జాబితాలో రాజకీయ జోక్యం:
ఓటర్ల జాబితా తయారీలోనూ, వార్డుల కేటాయింపులోనూ కూటమి ప్రభుత్వం తీవ్ర రాజకీయ జోక్యానికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా ఎస్సీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 6, 7 వార్డుల్లో ప్రస్తుతం 1,400 నుంచి 1,500 మంది వరకు ఎస్సీ ఓటర్లు నివసిస్తున్నప్పటికీ, కావాలనే ఈసారి ఆ వార్డులను ఎస్సీలకు కాకుండా ఇతరులకు కేటాయించారని ఎత్తిచూపారు. బౌండరీల ప్రాతిపదికన ఓటర్ల జాబితా రూపొందించామని చెబుతున్న అధికారులు, కూటమికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో హద్దులు దాటి ఓట్లను కలిపారని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లోని ఓట్లను వేర్వేరు వార్డులకు విడగొట్టారని ఆరోపించారు. ముఖ్యంగా 6వ వార్డు ప్రధాన రహదారి పరిధిలోని ఓట్లను తీసుకెళ్లి 4వ వార్డు నిమ్మతోట ప్రాంతంలో కలిపారని, అదీ కూడా ఒక క్రమపద్ధతి లేకుండా రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశంతో అక్కడక్కడా ఓట్లను తొలగించి మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఓటర్ల జాబితా ఇండెక్స్‌లో ఉన్న డోర్ నంబర్లకు, లోపల జాబితాలోని డోర్ నంబర్లకు అసలు సంబంధమే లేకుండా గందరగోళంగా తయారు చేశారని విమర్శించారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిక:
కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఓటర్ల జాబితాలోని అక్రమాలను సరిదిద్దాలని, నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పునఃపరిశీలించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అన్యాయంపై తమ పార్టీ తరఫున ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సాగేందుకు మున్సిపల్ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటేనపాటి గాబ్రియేలు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, పల్నాడు జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షేక్ రెహమాన్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సాతులూరి సుజాత, పల్నాడు జిల్లా యువజన విభాగం సెక్రటరీ కోట చిన్నబాబు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మైలేరి మార్కుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




