తాడేపల్లి : ఇవి ఎన్నికలు కావు కేవలం సెలెక్షన్స్ మాత్రమే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
. ఎన్నికల ప్రక్రియ మొత్తం హైజాక్
. ‘ఎలక్షన్స్’ కాదు ‘సెలక్షన్స్’ అంటూ మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ఆయన సుదీర్ఘ పోస్ట్ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఒక ఎన్నికను ఎలా గెలవాలో ప్రదర్శించినందుకు నారా చంద్రబాబు నాయుడు టీమ్, పోలీసులు, ఎస్‌ఈసీకి అభినందనలు అంటూ తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ వ్యవస్థలను హైజాక్ చేశారని జగన్ ఆరోపించారు. నామినేషన్ల ఘట్టం, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియల నుంచి పత్రాలను బలవంతంగా తొలగించారని, పోలింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి కేంద్రాల నుంచి బయటకు తోసేశారని మండిపడ్డారు. పోలింగ్ రోజున విపరీతంగా అక్రమాలకు పాల్పడటమే కాకుండా, పోలింగ్ శాతాలను మేనిపులేట్ చేసి, చివరికి లెక్కింపు కేంద్రాలను కూడా హైజాక్ చేశారని ధ్వజమెత్తారు. ఈ అరాచకాల కారణంగా ప్రజలు అభ్యర్థులను ఎన్నుకోలేదని, కూటమి నేతలే తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారని విమర్శించారు. ఇవి ఏమాత్రం ఎన్నికలు కావని, కేవలం ఎంపికలు మాత్రమేనని ఎద్దేవా చేసిన ఆయన.. దేశంలో అత్యవసరంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం ఈ ఫలితాలతో అత్యంత స్పష్టంగా తేలిపోయిందని ఉద్ఘాటించారు.
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ


