చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరాచకాలను, బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొంటూనే ప్రజల పక్షాన తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.చిలకలూరిపేటలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె సోమవారం మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాష్ట్రంలో విపక్షాలపై దాడుల పర్వం ప్రారంభమైందని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా విధ్వంసమైందని, రాష్ట్ర పాలన బీహార్‌ను తలపిస్తోందని విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలు, బీ-ఫారాలను అధికారుల ముందే చించివేశారని, రాత్రి వేళల్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని, ఓటర్ల రాజ్యాంగ హక్కులను అధికారులు, పోలీసులు కలిసి ఖూనీ చేశారని విడదల రజినీ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇవి ‘స్టేట్ ఎలక్షన్స్’ లా కాకుండా ‘స్టేట్ క్యాప్చర్డ్ ఎలక్షన్స్’ లాగా సాగాయని అభివర్ణించారు. ఒకవైపు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను అక్రమంగా ఇంట్లోనే నిర్బంధిస్తూ హౌస్ అరెస్టులు చేస్తుంటే, మరోవైపు అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. పోలింగ్ బూత్‌లను హైజాక్ చేయడం, యథేచ్ఛగా రిగ్గింగ్, సైక్లింగ్లకు పాల్పడటం వంటి అక్రమాలతో రాష్ట్రంలో పూర్తిగా ‘జంగిల్ రాజ్’ పాలన సాగుతోందని విడదల రజినీ మండిపడ్డారు.
కూటమి పాలనలో ఏపీ ‘బీహార్’ను తలపిస్తోంది: మాజీ మంత్రి విడదల రజినీ


