అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఖరారు చేస్తూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్గాల వారీగా మేయర్ పీఠాల కేటాయింపును ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఈ కేటాయింపుల ప్రకారం మొత్తం స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 మేయర్ స్థానాన్ని కేటాయించారు. అలాగే సాధారణ కేటగిరీలో జనరల్ మహిళలకు 5 స్థానాలు దక్కగా, మిగిలిన 4 స్థానాలను అన్రిజర్వ్డ్ రొటేషన్ స్థానాలుగా నిర్ధారించారు. వివిధ కార్పొరేషన్ల కేటాయింపులను చూస్తే మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎస్టీ కేటగిరీకి కేటాయించగా, రాజమండ్రి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లను ఎస్సీ వర్గానికి కేటాయించారు. బీసీ కేటగిరీకి కేటాయించిన స్థానాల్లో మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లను బీసీ మహిళలకు ప్రత్యేకించగా.. అనంతపురం, ఏలూరు, చిత్తూరు మేయర్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైఎస్సార్ కడప, గ్రేటర్ విశాఖపట్నం స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించారు. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లను అన్రిజర్వ్డ్ స్థానాలుగా ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా 106 పురపాలక సంఘాల విషయానికొస్తే, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీల వారీగా చైర్పర్సన్ పీఠాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్-I ప్రకారం 106 స్థానాలకు గాను వివిధ వర్గాలకు కేటాయించిన సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) కేటగిరీకి మొత్తం 3 స్థానాలు కేటాయించగా, ఇందులో ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళకు 1 స్థానం దక్కింది. అలాగే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించగా, ఎస్సీ జనరల్ 7, ఎస్సీ మహిళలకు 7 స్థానాలు కేటాయించారు. వెనుకబడిన తరగతులు (బీసీ) వర్గానికి మొత్తం 36 స్థానాలు కేటాయించగా, బీసీ జనరల్ 18, బీసీ మహిళలకు 18 స్థానాలు లభించాయి. మహిళా జనరల్ కేటగిరీకు మొత్తం 27 స్థానాలు కేటాయించగా, అన్రిజర్వ్డ్ ఎవరికీ రిజర్వ్ చేయని సాధారణ స్థానాలు మొత్తం 26 కేటాయించారు.మున్సిపాలిటీల వారీగా వివిధ వర్గాలకు కేటాయించిన స్థానాల వివరాలను పరిశీలిస్తే.. ఎస్టీ కేటగిరీకి గూడూరు (ఎస్టీ-మహిళ), ఆళ్లూరు (ఎస్టీ-జనరల్), ఆత్మకూరు (ఎస్టీ-జనరల్) కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి మహిళల కోటాలో చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల ఉండగా.. ఎస్సీ జనరల్ కోటాలో ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల దక్కాయి. బీసీ కేటగిరీ మహిళలకు ఆళ్లగడ్డ, సాలూరు, ఇచ్ఛాపురం, నర్సీపట్నం, ఎర్రగుంట్ల, జంగారెడ్డిగూడెం, పాలకొండ, తుని, పాలకొల్లు, కదిరి, పుంగనూరు, రాజంపేట, గుడివాడ, రాజం, గుంతకల్లు, గూడూరు (కర్నూలు), నందికొట్కూరు, ముమ్మిడివరం కేటాయించగా, బీసీ జనరల్ కోటాలో పిడుగురాళ్ల, పుత్తూరు, బేతంచెర్ల, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లె, తాడిపత్రి, తిరువూరు, నంద్యాల, హిందూపురం, మడకశిర, నెల్లిమర్ల, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, తాడిగడప, బి.కొత్తకోట ఖరారయ్యాయి. అలాగే మహిళా జనరల్ కేటగిరీకి కనిగిరి, కమలాపురం, కొవ్వూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆత్మకూరు (నెల్లూరు), నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పొన్నూరు, భీమవరం, చిలకలూరిపేట, జగ్గయ్యపేట, ఆమదాలవలస, మాచర్ల, ఆదోని, నాయుడుపేట, డోన్, బొబ్బిలి, రేపల్లె, పార్వతీపురం, పులివెందుల కేటాయించగా, అన్రిజర్వ్డ్ కేటగిరీకి తణుకు, తెనాలి, గురజాల, తాడేపల్లిగూడెం, అమలాపురం, ఎమ్మిగనూరు, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, కందుకూరు, మండపేట, దాచేపల్లి, నగరి, చీమకుర్తి, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, గొల్లప్రోలు, అద్దంకి, పెద్దాపురం, ధర్మవరం, బద్వేలు, దర్శి, మార్కాపురం, మైదుకూరు, నరసరావుపేట మున్సిపాలిటీలు నిలిచాయి.
