భూకక్ష్యలోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్
అంతరిక్ష పరిశోధనా రంగంలో చారిత్రాత్మక అధ్యాయానికి దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్టార్ బేస్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ‘స్టార్‌షిప్’ను భూమి చుట్టూ ఉన్న కక్ష్యలోకి (ఆర్బిట్) ప్రవేశపెట్టే అత్యంత కీలకమైన మిషన్‌ను చేపట్టింది. మానవాళిని చందమామ, అంగారక గ్రహాల వైపు తీసుకెళ్లే దిశగా ఇది అతిపెద్ద అడుగుగా భావిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తును పూర్తిగా మార్చివేసే సరికొత్త తీరాలకు ఈ ప్రయోగంతో ప్రయాణం ప్రారంభమైందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.
పునర్వినియోగ రాకెట్ వ్యవస్థ..
మొత్తం 407 అడుగుల ఎత్తు ఉండే స్టార్‌షిప్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. దిగువన ఉండే అత్యంత శక్తిమంతమైన ‘సూపర్ హెవీ బూస్టర్’, పైభాగంలో ఉండే ‘స్టార్‌షిప్’ వ్యోమనౌక. వీటిని వేగంగా, పూర్తిగా తిరిగి ఉపయోగించుకునేలా స్పేస్‌ఎక్స్ రూపకల్పన చేస్తోంది. రాకెట్లను పలుమార్లు ప్రయోగించే ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే అంతరిక్ష ప్రయోగాల వ్యయం గణనీయంగా తగ్గుతుంది. బూస్టర్ విడిపోవడం, బూస్ట్ బ్యాక్ అండ్ ల్యాండింగ్ బర్న్ వంటి సంక్లిష్ట దశలను విజయవంతంగా పూర్తి చేయడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. గత ప్రయోగాల్లో తలెత్తిన లోపాలను సరిదిద్ది హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్‌లలో పలు మార్పులు చేశారు.
26 నెక్స్ట్-జెన్ స్టార్‌లింక్ ఉపగ్రహాలు..
ఈ ప్రయోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశం 26 ‘స్టార్‌లింక్ V3’ ఉపగ్రహాలను తొలిసారిగా కక్ష్యలోకి పంపడం. నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతతో రూపొందించిన ఒక్కో V3 ఉపగ్రహం 1 TBPS డౌన్‌లింక్, 160 Gbps అప్‌లింక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మునుపటి V2 ఉపగ్రహాలతో పోలిస్తే డౌన్‌లింక్‌లో 10 రెట్లు, అప్‌లింక్‌లో 22 రెట్లు అధిక సామర్థ్యం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ ఇంటర్నెట్ వేగం, నాణ్యత అసాధారణంగా పెరగనున్నాయి. వీటిలో 3 ఉపగ్రహాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చారు. ఇవి అంతరిక్షంలో స్టార్‌షిప్ హీట్ షీల్డ్ పరిస్థితిని చిత్రీకరించి భూమికి సమాచారాన్ని అందిస్తాయి.
10 గంటల సుదీర్ఘ ప్రయాణం…
ఈ తొలి ఆర్బిటల్ మిషన్‌లో స్టార్‌షిప్ సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి భూమి చుట్టూ 6 సార్లు తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. దాదాపు 10 గంటల పాటు సాగే ఈ మిషన్ తర్వాత , చిలీకి పశ్చిమాన ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో స్టార్‌షిప్‌ను సురక్షితంగా ల్యాండ్ (స్ప్లాష్‌డౌన్) చేయనున్నారు. అంతరిక్షంలో ఒక రాప్టర్ ఇంజిన్‌తో డీ-ఆర్బిట్ బర్న్ నిర్వహించి, సురక్షితంగా పునఃప్రవేశం (రీ-ఎంట్రీ) సాధించడం ఈ మిషన్ లక్ష్యం. ఇది విజయవంతమైతే చంద్రుడిపై మానవ స్థావరాల ఏర్పాటు, అంగారక గ్రహంపైకి మానవులను పంపే స్పేస్ ఎక్స్ కల నెరవేరడం సులభతరం కానుంది.
Previous Article
పీటీ ఉష జాతీయ రికార్డు బద్దలు
Next Article
ఆత్మనిర్భర్ భారత్‌కు అల్యూమినియం రంగం కీలకం
Jani Mastan Shaik
About Author
You may also like
CINEMA
INTERNATIONAL
Behind the Screens: The Making of Your Favorite Games
- BY admin
- November 5, 2023
- 0 Comments
INTERNATIONAL
Exploring Virtual Worlds: The Ultimate Gamer’s Guide
- BY admin
- November 5, 2023
- 0 Comments

