ఆటోమొబైల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలతో కంపెనీలు కస్టమర్లను అబ్బురపరుస్తుండగా, తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసి ‘ఫ్లయింగ్ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్ మోడల్లో ఈ ఎగిరే కారును తీసుకొచ్చినట్లు ప్రకటించగా, ఇందుకు సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ ఖాతాతో పాటు టెస్లా అధికారికంగా విడుదల చేసింది. టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ ఫెసిలిటీలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఎగిరే కారును ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ సూపర్ కారు ఒక భారీ వంపు తిరిగిన ర్యాంప్‌పైకి దూసుకెళ్లి, తలకిందులుగా ప్రయాణించి, గాల్లోకి ఎగిరి సురక్షితంగా కిందకు దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను షేర్ చేస్తూ భవిష్యత్తులో ఎగిరే కార్లు అందుబాటులో ఉంటాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.ఫ్లయింగ్ కారుగా పూర్తిగా రీడిజైన్ చేసిన ఈ రోడ్‌స్టర్‌లో స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లను అమర్చారు. ఇవి పీడనం కలిగిన వాయువును ఉపయోగించుకుని థ్రస్ట్‌ను జనరేట్ చేస్తాయి. ఈ ప్రొపల్షన్ వ్యవస్థలో రెండు అల్ట్రా-హై ప్రెజర్ ఎయిర్ట్యాంకులు ఉండగా, ఒక్కోదాంట్లో దాదాపు 250 కిలోల వాయువు నిల్వ ఉంటుంది. ఈ సాంకేతికత ద్వారా ఈ కారు కేవలం సెకను కంటే తక్కువ సమయం లోపే 60 mph వేగాన్ని అందుకోగలదని టెస్లా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ కారు నియంత్రిత వాతావరణంలో గాల్లో ఎగిరే సాహస విన్యాసాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించింది.టెస్లా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తర్వాతి తరం రోడ్‌స్టర్ కారును వాస్తవానికి 2017 నవంబరులోనే ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ ఎగిరే కార్లకు సాధారణ రోడ్లపై ప్రయాణించడానికి ఇంకా ప్రభుత్వ నియంత్రణ మరియు భద్రతా పరమైన అనుమతులు లభించాల్సి ఉంది. ఈ అనుమతుల ప్రక్రియ పూర్తికాగానే, వచ్చే 2028 నాటికి ఈ ఫ్లయింగ్ కార్ల వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని టెస్లా సంస్థ ప్లాన్ చేస్తోంది.