
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను ఇష్టారాజ్యంగా మారుస్తున్నారని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రొంపిచర్ల మండలంలో నామినేషన్ కేంద్రాల మార్పుపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ విధానాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నేతృత్వంలో వైసీపీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)కి అధికారికంగా వినతిపత్రం బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రొంపిచర్ల మండలంలో నామినేషన్ కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా మారుస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా బలం ఉన్న ప్రాంతాలకు నామినేషన్ కేంద్రాలను తరలిస్తూ అధికార పార్టీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, గతంలో జరిగిన 2021 పంచాయతీ ఎన్నికల్లో ఏవైతే నామినేషన్ కేంద్రాలు ఉన్నాయో.. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అవే కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి కేంద్రాలను మారుస్తే సహించేది లేదని, దీనిపై న్యాయపరంగానూ, ప్రజాస్వామ్య యుక్తంగానూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండలానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.