ANDHRA PRADESH LOCAL NEWS

ఉపసంహరణ గడువు ముగిసినా రిజిస్టర్ ఎందుకు క్లోజ్ చేయలేదు

. కంటెస్టెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు కదిలేది లేదు
. వైసీపీ అభ్యర్థులు లేకుండానే నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన
. పల్నాడు కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి గోపిరెడ్డి ఫిర్యాదు


నరసరావుపేట:
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం మూడు గంటలకే ముగిసినప్పటికీ, ఎన్నికల అధికారులు విత్‌డ్రాయల్స్ రిజిస్టర్‌ను క్లోజ్ చేయకుండా ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కార్యాలయం గేటు ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి నేతల ఆదేశాలను పాటిస్తూ ఎన్నికల అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన అభ్యర్థులు స్థానికంగా లేకపోయినప్పటికీ, వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించడం ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలపై పల్నాడు జిల్లా కలెక్టర్‌కు , రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కూటమిలో విభేదాల వల్లే ప్రక్రియలో జాప్యం.. తక్షణమే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలి:
కూటమి పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, రెబల్ అభ్యర్థుల బెడద కారణంగానే టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు ఉపసంహరణల ప్రక్రియను నిలిపివేయడం లేదని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సీట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని జనసేన అభ్యర్థులు ధర్నాకు దిగారని, తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ నేతలు నామినేషన్లు వేశారంటూ బీజేపీ నాయకులు రాజీనామాలకు సిద్ధపడ్డారని ఆయన పేర్కొన్నారు. కూటమి రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకే మూడు గంటలు దాటినా రిజిస్టర్ మూసివేయలేదని విమర్శించారు. అధికారులు తక్షణమే విత్‌డ్రాయల్స్ రిజిస్టర్‌ను క్లోజ్ చేసి, పోటీలో ఉన్న అభ్యర్థుల (కంటెస్టెడ్ క్యాండిడేట్ల) తుది జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాబితాను అధికారికంగా ప్రకటించే వరకు మున్సిపల్ కార్యాలయం గేటు ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Jani Mastan Shaik

About Author