ANDHRA PRADESH LOCAL NEWS POLITICS

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి.. కారం పొట్లాలు వాడమన్నది దొంగ ఓటర్లను అడ్డుకోవడానికే: గోపిరెడ్డి

. కుల, మతాలను రెచ్చగొట్టిన చరిత్ర నా రాజకీయ జీవితంలో లేదు
. లాడ్జిలు,కళ్యాణ మండపాల్లో ఉన్న బయటి వ్యక్తులను వెంటనే బయటకు పంపండి
. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా స్థానిక ఎమ్మెల్యేను సైతం హౌస్ అరెస్ట్ చేయాలి


నరసరావుపేట: ఎక్కడా ఎన్నికల అక్రమాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ అధికారులను కోరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నానని డీఎస్పీ ఆరోపించడం సరికాదని అన్నారు. ఈ ఎన్నికలు రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నాయని, ఇందులో కుల, మతాల ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కుల, మతాలను రెచ్చగొట్టిన చరిత్ర లేదని స్పష్టం చేశారు.
దొంగ ఓటర్లు, రిగ్గింగ్ రాయుళ్లను అడ్డుకోవడానికే ఆ వ్యాఖ్యలు:
బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లు వేసే వారిని అడ్డుకోవడానికే మహిళలను కారం పొట్లాలు వాడమని చెప్పాను తప్ప, సామాన్య ఓటర్లను గానీ, టీడీపీ వారిని గానీ భయభ్రాంతులకు గురిచేయడానికి కాదని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బయటి రాష్ట్రాల నుంచి రౌడీలను తెచ్చి నామినేషన్లను అడ్డుకున్నారని, వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైసీపీ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే అక్రమాలకు పాల్పడే వారిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.
బయటి వ్యక్తులను పంపించేయండి.. ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయండి:
నరసరావుపేట పట్టణంలోని పలు కళ్యాణ మండపాలు, లాడ్జిలలో బయటి గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికి, రిగ్గింగ్‌లకు పాల్పడటానికి మకాం వేశారని గోపిరెడ్డి ఆరోపించారు. వారందరినీ తక్షణమే పట్టణం నుంచి బయటకు పంపించి వేయాలని ఎస్పీ, డీఎస్పీ, సీఐలను ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎక్కడా రిగ్గింగ్‌లు, దొంగ ఓట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తే తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. అదేవిధంగా, ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా స్థానిక ఎమ్మెల్యేను కూడా హౌస్ అరెస్ట్ చేయాలని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Jani Mastan Shaik

About Author