అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్మాది జరిపిన రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని గోపికను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు నేరుగా వెళ్లిన వైఎస్ జగన్, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బృందంతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు అందిస్తున్న అత్యవసర వైద్య సేవల పురోగతిని సమీక్షించిన అనంతరం, తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కొండంత ధైర్యాన్ని నూరిపోశారు. దేవుడి దయతో పాప కోలుకుంటోందని వైద్యులు చెప్పడం కొంత మనసును కుదుటపరిచే విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో విరివిగా పెరిగిపోయిన మత్తుపదార్థాలు, గంజాయి,బెల్టు షాపుల సంస్కృతి కారణంగానే రాప్తాడులో స్కూల్ పిల్లలపై ఇలాంటి దారుణ ఘతుకాలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏకంగా రంపం పట్టుకుని పాఠశాలలోకి వచ్చి విద్యార్థినులపై దాడి చేస్తుంటే అడ్డుకునే వ్యవస్థలు లేకుండా పోయాయని, పల్లె పల్లెనా మత్తుపదార్థాలు వ్యాపిస్తున్నా అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని, అలాగే మెరుగైన వైద్య ఖర్చులను పూర్తిస్థాయిలో భరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం సాయం అందించకపోతే వైఎస్సార్సీపీ తరఫున పూర్తి వైద్యాన్ని అందిస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.50 లక్షల సాయాన్ని ఖచ్చితంగా అందజేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విపక్షాలను వేధించడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఫలితంగానే శాంతిభద్రతలు క్షీణించి అరాచకాలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
బెంగళూరు ఆసుపత్రిలో బాధిత బాలికను పరామర్శించిన వైఎస్ జగన్


