ANDHRA PRADESH NEWS POLITICS STATE

ఎన్నికల చరిత్రలో చీకటి రోజు

పులివెందుల: ఎన్నికల చరిత్రలో ఇది చీకటి రోజని మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు .

. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
. జగన్ కాన్వాయ్‌లోకి దస్తగిరి కారు
. Z+ సెక్యూరిటీ వలయంలో భద్రతా లోపం
. ఆర్వో కార్యాలయం ఎదుట 70 మంది ఏజెంట్లతో బైఠాయింపు
. అభ్యర్థులపై భౌతిక దాడులు
. ప్రసార మాధ్యమాలపై విరుచుకుపడ్డ మూకలు
. ఆర్వో ఆఫీస్ వద్ద మాజీ సీఎం ధర్నా
. ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్
. ఎన్నికల రద్దుకు డిమాండ్

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అత్యంత నాటకీయ, ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా తీవ్ర భద్రతా లోపం వెలుగుచూసింది. వైఎస్ జగన్ Z+ కేటగిరీ సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి కారు ఒక్కసారిగా మాజీ సీఎం కాన్వాయ్‌లోకి దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. అంతకుముందు జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌పై జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా ఆంక్షలు విధించడంతో ఇంధనం తగ్గిపోయి ప్రమాదకర స్థితిలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, కూటమి ప్రభుత్వం తనను అడ్డుకునేందుకు కుట్ర పన్నిందని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మొత్తం 80 పోలింగ్ బూత్‌లకు గాను 70 చోట్ల వైసీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసివేసినట్లు నేతలు ఆరోపించారు. కేవలం 14 మంది ‘ఇతరుల’ కేటగిరీ ఓటర్లు ఉన్న ప్రాంతంలో ఉదయం 11:00 గంటలకే ఏకంగా 681 ఓట్లు పోలయినట్లు అధికారులు నివేదిక ఇవ్వడం ప్రత్యక్ష రిగ్గింగ్‌కు నిదర్శనమని మండిపడ్డారు. తమ ఏజెంట్లను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ 70 మంది ఏజెంట్లతో కలిసి ఆర్వో కార్యాలయం ఎదుట రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యలతో మాట్లాడిన జగన్.. నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లలో సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయలేదని నిలదీశారు. ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా ఓటింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ పులివెందులలో వెంటనే రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల బూత్‌లను ఆక్రమించుకుని టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడుతున్నాయని, పోలీసు అధికారులకు ఫోన్ చేసినా ఏమాత్రం స్పందించడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. అక్రమాలను అడ్డుకునేందుకు యత్నించిన వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై భౌతిక దాడి చేసి ఆమె వాహనాన్ని ధ్వంసం చేయగా, మరొక చైర్మన్ అభ్యర్థి జింక వెంకటచలపతిపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఓటు హక్కు కోసం వచ్చిన వృద్ధులు, మహిళలను పోలీసులు బలవంతంగా తోసివేసి భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ అరాచకాలను కవర్ చేస్తున్న ‘ఇండియా టుడే’, ‘ఇండియా టీవీ’, ‘ఎన్డీ టీవీ’ మీడియా ప్రతినిధుల కెమెరాలు, ఫోన్లను పచ్చ రౌడీలు పగలగొట్టి ధ్వంసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఓటు వేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రం లేవని స్పష్టం చేసిన వైఎస్ జగన్, తాను ఓటు వేస్తే అంతా సవ్యంగా ఉందనే భ్రమ కలుగుతుందనే ఉద్దేశంతో ఓటు వేయకుండానే పులివెందుల నుంచి వెనుదిరిగారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం చంద్రబాబు చేతిలో తోలుబొమ్మగా మారిందని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బిహార్‌ను మించిన అరాచక పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని, తక్షణమే ఈ మున్సిపల్ ఎన్నికలను రద్దు చేసి పటిష్ట భద్రత నడుమ రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పులివెందులలో రీపోలింగ్ పెడితేనే వచ్చి ఓటు వేస్తానని స్పష్టం చేస్తూ, కూటమి అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Jani Mastan Shaik

About Author