పుంగనూరు:
పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుంగనూరు ఎన్.ఎస్. పేటలోని బసవరాజా జూనియర్ కాలేజీ మెయిన్ గేట్ వద్ద నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న 9 మంది కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థులు,ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు ఆయన కాన్వాయ్‌లోని 6 వాహనాలు పూర్తిగా ధ్వసమయ్యాయి. ముడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌పై కూడా టీడీపీ వర్గాలు దాడి చేశాయి. కేవలం 2 నామినేషన్లు మాత్రమే స్వీకరించి, మిగిలిన నామినేషన్లను తీసుకోకుండా అడ్డుకున్నారని, నామినేషన్ ప్రాంగణంలోకి 400 మందికి పైగా చేరుకుని నిరసన తెలిపారని, ఈ మొత్తం ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే: జూపూడి ప్రభాకరరావు ధ్వజం
జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకపోతే సాధారణ అభ్యర్థుల పరిస్థితి ఏంటని వైసీపీ నేత జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది నామినేషన్లు వేయడానికా లేక ప్రతిపక్షాలపై దాడులు చేయడానికా అని నిలదీశారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇంతటి అరాచకం జరుగుతోందని, ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని మండిపడ్డారు. ప్రజాబలం ఉన్నవాడు ఎన్నికల్లో పోరాడతాడని, ఓటమి భయం ఉన్నవాడే దాడులకు దిగుతాడని, స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు తెగబడుతోందని ఆరోపించారు. పోలీసులు ప్రజలకు రక్షకులా లేక అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యమా అని ప్రశ్నించిన ఆయన, టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకుని నిలబడటమేనా శాంతిభద్రతల పరిరక్షణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్:
ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని, రెండేళ్ల పరిపాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందుకే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని, రాష్ట్ర పరిస్థితి జంగిల్ రాజ్‌లా మార్చారని ధ్వజమెత్తారు. లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రత లేని పరిస్థితులు చూస్తున్నామని, చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని, ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలోని పరిస్థితులను కోర్టుల ముందుంచుతామని, పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు నిరసనలు:
ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ కార్యాలయం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. నామినేషన్ల సమయంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరగడం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు.
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి

