సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ‘ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన’ ఒకటి. ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు కీలక ఆర్థిక సాయం అందుతుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సంవత్సరానికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. బీమా కాలపరిమితిలో ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే నామినీకి ఏకంగా రూ. 2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. అయితే ఈ క్లెయిమ్ ప్రయోజనం పొందడానికి పథకానికి సంబంధించిన నిబంధనలు ,అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు అర్హులు. దీనికోసం ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ, ఏదైనా ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే, అర్హత కలిగిన ప్రతి ఖాతాదారుడు విడివిడిగా ప్రీమియం చెల్లించి ఈ బీమా కవరేజ్ పొందవచ్చు. ప్రీమియం సొమ్ము ప్రతి సంవత్సరం ఖాతాదారుడి సేవింగ్స్ అకౌంట్ నుంచి నేరుగా ఆటో డెబిట్ అవుతుంది. ఈ బీమా కవరేజ్ కాలపరిమితి ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మరుసటి సంవత్సరం మే 31 వరకు అమలులో ఉంటుంది.రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పాముకాటు, చెట్టుపై నుంచి కింద పడటం లేదా నీటిలో మునిగిపోవడం వంటి ఊహించని ప్రమాదాల వల్ల మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం క్లెయిమ్ లభిస్తుంది. అయితే ఆత్మహత్యలకు ఈ పథకం వర్తించదు. క్లెయిమ్ చేసుకునే సమయంలో ఎఫ్ఐఆర్ , పోలీస్ రికార్డులు, మెడికల్ సర్టిఫికెట్లు వంటి సరైన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అత్యంత సులభంగా చేరదగిన ఈ పథకానికి సంబంధించి ప్రీమియం కట్ అయ్యే తేదీలు, క్లెయిమ్ ప్రక్రియ మరియు అవసరమైన పత్రాల గురించిన పూర్తి వివరాలను మీ సమీప బ్యాంక్ లేదా పోస్టాఫీసును సందర్శించి ముందే తెలుసుకోవడం మంచిది.