అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మందిలో 9 మంది అధికారులకు నూతన పోస్టింగ్‌లు ఖరారు చేయగా, మరో ఇద్దరు అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయంతో బదిలీ అయిన అధికారుల ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈ బదిలీల్లో భాగంగా సౌరభ్ గౌర్‌ను ఏపీ భవన్ ఓఎస్డీగా, మురళీధర్‌ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా, ఆమ్రపాలిని పర్యాటక , సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు. అలాగే నీలకంఠరెడ్డిని యువజన సేవల శాఖ సంచాలకుడిగా, తేజ్ భరత్‌ను సామాజిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా, వరప్రసాద్‌ను పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు బి. అనిల్ కుమార్ రెడ్డిని పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా, గెడేల శ్రీను కుమార్‌ను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా, మంజుల బాలాజీ దిగంబర్ను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కాకుండా ఇద్దరు అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఉద్యానవన (హార్టికల్చర్) అండ్ సెరికల్చర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడిగా అదనపు బాధ్యతలు అప్పగించగా, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శుభమ్ బన్సల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

