. వాలంటీర్ల వ్యవస్థ రద్దు వల్లే సహాయక చర్యల్లో వైఫల్యం
. కిలో సోనామసూరి రూ. 90 దాటింది
. బియ్యాన్ని కృత్రిమ కొరత సృష్టించిన టీడీపీ నేతలు
. వరి,ఆక్వా రైతులకు మద్దతుగా ఉండండి
. ప్రభుత్వ కొనుగోలుపై ఒత్తిడి తేవాలి
. తుపాను బాధితులకు తోడుగా ఉండాలి
తాడేపల్లి:స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్రంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అగ్రనేతలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల అండదండలతో తమ పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని, రిటర్నింగ్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏజెంట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు.నామినేషన్ పత్రాలను చింపివేయడం, ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేయించడం, బి-ఫారాలను మాయం చేయడం వంటి అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నామినేషన్ల సమయంలోనే ఇన్ని అక్రమాలు, రిగ్గింగ్‌లు జరిగాయని, రాబోయే పోలింగ్ రోజున కూడా గతంలో జరిగినటువంటి ఘటనలే పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉంటూ, మన ఓటర్లను సురక్షితంగా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా లీగల్ సెల్ సహాయంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన అధికారులను భవిష్యత్తులో తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.’అర్నబ్’ తీవ్ర తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన తీరప్రాంత జిల్లాల్లో ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో తోడుగా నిలవాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిర్వహించిన లో ఆయన మాట్లాడారు.గత వైఎసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విపత్తుల సమయంలో తక్షణ ఉపశమనం అందించేవని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసి రద్దు చేయడం వల్లే క్షేత్రస్థాయిలో తుపాను సహాయక చర్యలు సంపూర్ణంగా విఫలమయ్యాయని విమర్శించారు. కూటమి నేతలు ప్రకృతి విపత్తులను కూడా తమ స్వార్థ ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు.
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో నాణ్యమైన సోనామసూరి బియ్యం ధర కేజీ రూ. 90 దాటిపోయిందని, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడితో పాటు పలువురు టీడీపీ నేతలు బియ్యాన్ని కృత్రిమంగా కొరత సృష్టించి మార్కెట్లోకి రాకుండా బ్లాక్ చేస్తున్నారని, దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ బియ్యం మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించడం దారుణమన్నారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వరి, ఆక్వా, కూరగాయలు,పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జగన్ గుర్తుచేశారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో దళారుల బారిన పడకుండా ప్రతీ గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు సేకరించేలా జిల్లా యంత్రాంగంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
